Monday, December 24, 2012

జ్ఞాపకం

ఇప్పుడు మనం వున్న ప్రస్తుత జీవన విధానం లో సత్సంబంధాలు, ఆరోగ్యకర వాతావరణం, ఆలోచనా సరళి  లో గత కొద్ది కాలం లోనే చాలా మార్పులు చోటు చేస్కోవడం అన్నది గమనించదగ్గ విషయం. నా చిన్నప్పుడు అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను పడుకునే ముందు కళ్ళు మూసుకుని అలా గుర్తుకు తెచ్చుకుంటే ... ఆహా మనసుకు ఎంత  హాయి గా వుంటుందో! .... 

దౌర్భాగ్యం ఏంటో కానీ అలా ఆ మధురానుభూతులను తలుచుకోవడానికి కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి రావడం బాధాకరం. 

అప్పుడు 2 లేక 3 వ తరగతి చదివేరోజుల్లో రాత్రి భోజనం ముగించాక మా నాన్న గారితో కలిసి మిద్దె మీద పడుకుని అలా ఆకాశం వంక చూస్తే... పండు వెన్నెల, చల్లటి గాలి, ఆకాశం అంతా  చుక్కలు... కాస్త ఆగి ఆగి నెమ్మదిగా ముందుకు కదిలే మేఘాలు. మేఘాల మాటుకి చందమామ వెళితే ఆ తరువాత నెమ్మదిగా బయటకి రావడం ఒక అద్భుతం ఆ అనుభూతి మాటలకి అందనిది. ఈ లోపు దూరంగా నక్షత్రాలు ఒకచోటనుంచి మరొకచోటికి వేగంగా కదలడం, చుక్కలు రాలిపోవడం... వెంటనే వాటి గురించి ఒక దోశడు  ప్రశ్నలు మా నాన్న గారికి సందిచడం.... మా నాన్నగారు అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పడం .... నాన్న ఉపాద్యాయుడు కావడం వాళ్ళ అన్ని ప్రశ్నలకు చక్కటి సంపూర్ణ సమాధానాలు వచ్చేవి.... అలా ఆకాశం గురించి, నక్షత్రాల గురించి నాన్న చెప్తూ వుంటే అమ్మ కుడా పని ముగుంచుకుని వచ్చి మాతో చేరిపోయి మా నాన్న కు సహాయంగా కొన్ని విషయాలు చెప్పేది. అన్ని వింటూ నెమ్మదిగా ఒక్కొక్కరూ నిద్రలోకి జారుకునేవాళ్ళం..... ఆ నిద్ర కూడా ఎంతో ఆహ్లాదంగా వుండేది..... 

అప్పుడు ప్రచార, ప్రసార మాధ్యమాలంటే ఒక్క రేడియో మాత్రమే, టీవీ లు కుడా ఉండేవి కాని చాలా డబ్బున్న కొద్ది మంది ఇళ్ళలో మాత్రమే అగుపించేవి... మద్యాహ్నం బడి నుంచి భోజనానికి ఇంటికి వచినప్పుడు రేడియో లో సరిగ్గా పాడిపంటలు అనే శీర్షిక ప్రసారం అయ్యేది అది వ్యవసాయం, పాడిపంటల గురించి మంచి ఉపయోగకరమైన విషయాలను మన ఇంట్లో మన కుటుంభ సభ్యుల మధ్య జరిగే ఒక చక్కటి సంభాషణ లా ఎంత చక్కగా ఉండేదో.... ఏంటి పెద్దమ్మా .... అంటూ మొదలయ్యేది... అది నాకు ఇప్పటికి గుర్తు.... ఆ తర్వాత కొన్నాళ్ళకి మా ఇంట్లో టీవీ వచ్చాక.. ఆదివారం కోసం పిల్లలంతా ఎంతో ఆసక్తి గా ఎదురుచుసేవాళ్ళం... జంగిల్ బుక్ అని కార్టూన్ ప్రోగ్రాం వచ్చేది, అదంటే పడి  చచ్చేవాళ్ళం, ఆ తర్వాత మహా భారత్, సాయంత్రం తెలుగు సినిమా.... శుక్రవారం చిత్ర లహరి... ఇక శాంతి స్వరూప్ గారి వార్తలు... ఇలా ఎన్నో గుర్తుకు వస్తాయి. 

కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి... పట్టుమని 10 నిముషాలు చానెల్ మార్చకుండా టీవీ చూసిన రోజు లేదంటే నమ్మండి. అత్తా కోడళ్ళు, ఆడపడుచుల మధ్య పగ లు,ప్రతీకారాలు, అనవసర మాటల యుద్ధాలు.... ఎందుకో అర్థం కాని హావ భావాలు, భావావేశాలు..... పిచేక్కిపోయే సినీ సంగీతాలు.

మహానుభావుడు S .P. బాల సుభ్రహ్మణ్యమ్ మూలాన 'పాడుతా తీయగా', చిన్న పిల్లల పాటల ప్రోగ్రాం లు తప్ప మరేవీ చూడటానికి మనసొప్పని పరిస్థితి. అతి బాధాకరమైన విషయం ఏంటంటే నా వయసు వారికి కనీసం పడుకునే ముందు తలుచుకోవడానికి కొన్ని మధురానుభూతులు వున్నాయి, కానీ తరువాతి తరం..అంటే ఇంకో 10 సంవత్సరాల తరువాత పిల్లలకు ఇంతటి హాయి గొలిపే అనుభూతులు ఉండవేమో.. ప్రతి క్షణం పరిస్తితులతో పోటీ, మితి మించిన, వేగవంతమైన జీవన శైలి, తలచుకుంటే చాలా బాధ గ వుంటుంది... 

ఇదంతా ఎందుకు గుర్తోచిందంటే దూరదర్శన్ లో 'మాడపాటి సత్యవతి' గారి ఇంటర్వ్యూ చూసాను. ఆమె రేడియో లో వ్యాఖ్యాత గా పని చేసే రోజులను, తెలుగు భాష మీద ఆమెకున్న మమకారాన్ని ఏంతో చక్కగా పంచుకుంది. అది చూసాక నాకు నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఒక్కొక్కటి గ గుర్తు చేస్కుని మీతో పంచుకోవాలనిపించి రాసాను.... 

ఇది చదివాక మీకు మీ చిన్న నాటి మధురానుభూతులు తప్పక గుర్తుకు వస్తాయి కదా అదే నా 'జ్ఞాపకం' ముఖ్యోద్దేశం. అలా హాయిగా గుర్తు తెచ్చుకోండి.. మనసుకు ఎంత ఆహ్లాదంగా వుంటుందో చుడండి.


4 comments:

  1. అవునండీ మనసుకి నిజమైన నేస్తాలు చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలే.
    రాబోయే తరాలకవి ఉండవు. బాధాకరమే.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండి చిన్ని ఆశ గారు... మీ పేరేంటో తెలిదు కానీ మీ కవితలు, మీరు వేసిన బొమ్మలు నాకు చాల బాగా నచ్చాయి. మీ బ్లాగ్ చూసాను చాలా బాగుంది....

      Delete
  2. ఇప్పటి పిల్లలకేదో అన్యాయం జరిగిపోతుందని, వాళ్ళు ఏవేవో మిస్ అయిపోతున్నారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది.
    మనకున్న పరిమితులలో, మన పద్దతులలో మనం ఆనందంగా ఉండి ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో ఉన్న పిల్లలు, వాళ్ళకున్న పరిమితులలో వాళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారేమో అని ఎందుకు ఆలోచించకూడదు.
    మనం ఒకప్పుడు వెన్నెల్లో కుర్చుని మాట్లాడుకున్నామని వాళ్ళని కూడా అలా కుర్చొమనలెమ్ కదా. ఏమో వాళ్లకి ఫేస్బుక్ లో చాటింగ్ చేయడం, మొబైల్ గేమ్స్ ఆడుకోవడం లోనే ఎక్కువ ఆనందం ఉందేమో ?
    ఇప్పుడు మనం ఎలా బాధపడుతున్నామో, భవిష్యత్తు లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు గురించి ఇలానే బాధపడతారు. కాలం మారుతున్నప్పుడు ఆనందం కలిగించే విషయాలు కూడా మారతాయి. మనం ఆనందించినట్టే వాళ్ళు కూడా ఆనందించాలని రులేమి లేదు కదా. మనకి కూడా కంపూటర్లు , టీవీ లు ఉంది ఉంటె అలా వెన్నెల్లో ఎందుకు కూర్చుంటాం. కృష్ణ ప్రియ గారి బ్లాగ్ లో ఇలాంటి పోస్టే చదివాను.
    Please remove word verification.

    ReplyDelete
    Replies
    1. కాశీ గారు ఆనందం అన్నది అన్నింటిలోను వున్నది.. మీరన్నదీ నిజమే... 'మనకున్న పరిమితులలో, మన పద్దతులలో మనం ఆనందంగా ఉండి ఉండవచ్చు' కానీ పద్దతులు పరుదులు దాటుతున్నాయి, పరిమితులు కుచించుకు పోతున్నాయి... ఏది ఏమైనా రాను రాను ఆరోగ్యకరమైన ఆనందాలు తగ్గుతున్నాయన్నది వాస్తవం.

      Delete