Saturday, December 29, 2012

స్త్రీ వాది పంపర పరంధామయ్య

సాయంత్రం పని ముగిసాక పరంధామయ్య తన వరండా లో కూర్చుని కాలక్షేపానికి ఏవో పుస్తకాలు, పేపర్ లు తిరగేస్తున్నాడు. ఇవాళ శనివారం  కదా నాక్కూడా శలవు.. కాస్తంత టైం వుంది కదా పరంధామయ్య తో మాటా మంతీ జరిపితే చాలా విషయాలు తెలుస్తాయి అని అలా వెళ్లాను.పరంధామయ్య ముందున్న పేపర్ లో అమ్మాయిల  ఫై జరుగుతున్న  అఘాయిత్యాల  గురించిన వార్త కంట పడింది.... మనసెక్కడో చివుక్కు మని, బాధని ఆపుకోలేక పరంధామయ్య ని ఇలా అడిగాను.

సమాజం లో స్త్రీ పాత్ర ఏమిటి ?

ఆ... స్త్రీ లూ , పురుషులు ఇద్దరూ సమానమే... అన్నాడు నా వైపు చూస్తూ.

(ఈ ప్రశ్నకి చాలా మంది దగ్గర నుంచి వచ్చే సమాధానం... పురుషుడితో సమానమైన పాత్ర అని.
ఇలా సమాధానం చెప్పే చాలా మందికి ఈ మాటలు అస్సలు తడబాటు, కాస్తంత ఆలోచన కూడా లేకుండా వచ్చేస్తాయి.) 

ఈ సమాధానం.. వినడానికి గొప్పగా ఉండి ఉండవచ్చు, కానీ "నిజానికి జీవితమనే నాటకం లో మొదటినుంచీ స్త్రీ పాత్ర ని మోసం చేస్తూనే వుంది మన జన గణం" అని పరంధామయ్య తో అన్నప్పుడు. ..భార్యని చాలా బాగా చూస్కునే పంపర పరంధామయ్య  ఈ విషయం అస్సలు అంగీకరించలేదు.. పైగా తన వాదనను ఇలా వినిపించాడు...

"నువు  అన్నది పుస్తకాలు రాయడానికి, సభలలో మైకుల ముందు గంటలకు గంటలు దుమ్ము దులపడానికి బాగా పనికొచ్చే కథా మూలమే కాక మరేమిటి? అదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడంతా సమానమే, నువ్వు చెపుతున్నవి పేపర్ లో, టీవీ ల లో చూపిస్తున్న,ఎక్కడో జరుగుతున్న కొన్ని అరాచకాల వలన నష్టపోయిన కొంతమంది ఆడపిల్లల మీద నీ ఆవేదన... నీ భావన అభినందనీయం కూడా"...

మీరు స్త్రీ వాది కదా మీరిలా చెప్తారని నేను అనుకోలేదు... అంటే ఇప్పటి సమాజం లో స్త్రీ కి అన్నింటిలో పురుషుడికి సమానంగా హక్కులున్నాయంటారా ?

ఎందుకు లేవూ? ఇంకా ఎక్కువే అని చెప్పాలి....

ఇంతలో పరంధామయ్య సెల్ మోగింది..
హలో... చెప్పండి... ఎన్నింటికి?... సరే తప్పక వస్తాను...

నేనింకా ఆ ఎక్కువ హక్కులేంటా... అని ఆలోచిస్తున్నా... పరంధామయ్య పిలుపుతో ఆలోచనల నుంచి బయటపడి, ఏంటండి ఎక్కడికో వస్తానంటున్నారు...?

హా అవును ఇప్పుడు కాదు... రేపు ఉదయం 11 గంటలకి... స్త్రీ హక్కుల పోరాట సమితి సభ లో... స్త్రీ కి కావలసిన హక్కుల గురించి మాటాడడానికి ఆహ్వానం.... వెళ్ళాలి.

అంటే స్త్రీ కి కావలసిన హక్కుల సాధన గురించి అక్కడ మీరు మాటాడతారన్నమాట?
ఇంకా ఎవరెవరు మాటాడతారు?

సువర్ణ లక్ష్మి, రామయ్య,బాల మురళి,అనంతయ్య గారు, రెహమాన్,భాస్కరం....

అదేంటండి..? సభ ఏమో స్త్రీ హక్కుల గురించి... మాటాడేవారు అందరూ మగవారే వున్నారు... ఒక్క సువర్ణ లక్ష్మి తప్ప!

ఏమనిపించిందో కాని నా వైపు చూడకుండానే సమాధానం చెప్పారు...

ఎవరు ప్రసంగించారు అని కాదు...దేనికోసం అన్నది ముఖ్యం.

పరంధామయ్య గారూ... సభలో మీరేమని ప్రసంగిస్తారో కాస్త చెప్తారా?

స్త్రీ కి పురుషుడితో సమాన హక్కుల గురిచి...

ఇందాకే పురుషుడికన్నా ఎక్కువ హక్కులున్నాయన్నారూ ?...ఇంకా దేనికండి?

అన్నాను... కానీ...కానీ...!

పోనీ లెండి ఆ సభ లో ప్రసంగించడానికి మీ శ్రీమతి గారిని పిలవలేకపోయారా..అన్నాను.

ఆ దాని మొహం దానికేం తెలుసు... నోరు తెరిచి పచారీ కొట్టుకెళ్ళి  సరుకులు తెమ్మని నన్ను అడగలేదు.. ఇంక హక్కులనేం అడుగుతుంది నా బొంద...

అయినా సంసారాన్ని చక్కగా చుస్కోవడం లోనే దానికి ఆనందం.. అది దాని హక్కు, బాధ్యత కూడా.

అంటే భర్త, పిల్లలు, ఇల్లు ఈ మూడింటిని జాగ్రత్తగా చూస్కోవడమా ఆవిడ గారి హక్కు ?

అయినా మీ మీద గౌరవం తో ఆమె మాటాడకపోవచ్చు కానీ... వారికేం హక్కులు కావాలో వాళ్ళనే మాటాడనిస్తే బాగుంటుంది కదా?

వాళ్ళు రారయ్యా... అందుకే వాళ్ళ తరపున మా లాంటి వాళ్ళు వుద్యమిస్తుంటారు.
వచ్చినా పాపం వాళ్ళ ఆవేదన పట్టించుకునే వాళ్ళెవరు చెప్పు? ఏది కావాలంటే అది మగ వాళ్ళతో పోటీ గా చెయ్యడానికి చొరవ చూపించలేరు.... అందుకే మేము ముందుండి నడిపించాలి.

నేను తప్పు చేసినా, సంసారానికి తక్కువ చేసినా నన్ను నిలదీయడమే నా భార్య హక్కు.
వాటిని గౌరవించడం నా బాధ్యతా....

చపితే గొప్ప అనుకుంటావ్ కానీ... ఇంటి ఖర్చులకీ, తన సొంత ఖర్చులకీ  నా భార్య నన్ను డబ్బు కావాలి అని అడిగింది కాదు....

ఆవిడ దగ్గర వున్న డబ్బు వాడుకుంటుందా ఏంటి.....  

అది కాదయ్యా చెప్పేది కాస్త పూర్తిగా విను... నేను ఇంట్లో దానికి ఎంత హక్కు వుందో వివరించడానికి చెప్తున్నా... 
నన్ను అడగకుండా నా చోక్కా జేబు లో తీస్కునే హక్కు దానికి ఇచ్చాను... తెలుసా.

ఓహొ... ఎప్పుడిచ్చారండి..?

నేనేప్పుడైతే స్త్రీ ల హక్కుల గురించి పోరాటం మొదలెట్టానో అప్పటినుంచి.... అంటే మా పెళ్ళైన దగ్గరనుంచి.

మంచిది... కానీ నాకో సందేహం.... అన్నాను

ఇవాలేంటో తమరికి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగాలనిపిస్తుందాయే.... అడగండి... అడగండి....

మీ శ్రీమతి గారి హక్కులు మీ దగ్గరెందుకున్నాయండి?

ఇదేం పిచ్చి ప్రశ్న....

ఆ ఆ... అది కాదండి.. పెళ్ళైన వెంటనే ఆవిడ హక్కుల్ని తిరిగి మీరు ఆవిడకి ఇచ్చేశాను అంటేనూ... 

ఈ సారి పరంధామయ్యకి చిర్రెత్తుకొచ్చింది.

ఇంతలో ఏమండీ.... అన్న పిలుపు....పరంధామయ్య గారి ఇంటి ఇల్లాలు కాంతారత్నం గారు.
ఓ సారి ఇలా వస్తారా..
అబ్బా ఎంటే నీ గోల... ఇక్కడ మాటాడుతున్నానా.... ఏంటో చెప్పు .

పచారీ కొట్టు వాడికి 1500 బాకీ వున్నామా... ఇంట్లో బియ్యం నిండుకున్నాయి... వాడికి ఇవ్వడానికి మీ జేబులో 600 రూపాయలు మాత్రమే వున్నాయ్. 

అది విన్న పరంధామయ్య...గొంతు పెద్దది చేసి, వెలిగిపోతున్న మొహం తో...
ఇప్పుడైనా తెలిసిందా నా ఇల్లాలు నన్ను డబ్బు కోసం అడగలేదు.... అని ఇంట్లో కి చూసి...

ఆ.. అవే వున్నాయి... ఈ మధ్య దుబారా ఎక్కువైంది... ఖర్చులు తగ్గించే మార్గం వెతుకు... సర్దుకోవడం నేర్చుకో.

అంటూ నా వైపు తిరిగి... వీళ్ళని చూస్తే జాలేసినా ఒక్కో సారి కోపం వస్తున్నది... హక్కులిచ్చాం కదాని దుర్వినియోగం చేస్తారు... ఎప్పుడు మారతారో ఏమిటో....

అదిగో మళ్ళీ వాళ్ళ హక్కులు అంటారూ... వాటిని మీరిచ్చారు అంటారూ.... ఇదేంటో.... అంటుండగానే పరంధామయ్య కి నామీద ఎక్కడ లేని కోపం వచ్చి...

ఇంతకీ నీకేం కావాలయ్యా.... కాలక్షేపానికైతే.. ఏ సినిమా కో వెళ్ళు... నీ వయసుకు మించిన తెలివితో నా బుర్ర తినకు... ఐనా ఇవన్నీ నీకు నీ అనుభవమే నేర్పుతుంది లే.....

నాకు ఫక్కున నవ్వొచ్చి... సగం ఆపుకుని సగం కక్కేసాను... ఆయనకు ఇంక కోపం నశాలానికంటింది.

ఈ నవ్వు మిమ్మల్ని అవమానించడానికి కాదు.. క్షమించండి... ఇందాక మీ ఇంటికొస్తుంటే దార్లో ఓ కుర్రాడు స్త్రీ వాదం అంటే ఏంటి అని అడిగాడు... అదేంటో కరెక్ట్ గా నాకే తెలీక... ఇప్పుడు నీకిది చెప్పినా అర్థం అయ్యే వయసు కాదు పోను పోను నీకే తెలుస్తుంది లే అన్నాను.. అది వినకుండా వాడు మళ్ళీ స్త్రీ వాదం అంటే ఏంటో చెప్పమంటే... ఆ పక్కనే వున్న కొట్టు లో ఇస్త్రీ చేస్తున్న ఒక ముసలాయన మేమే ఇస్త్రీ వాళ్లము జత 6 రూపాయలే అన్నాడు.. అది గుర్తొచ్చి నవ్వెను...

నేను వాడికి చెప్పిందే మీరు నాకు చెప్తున్నారు...

 ఇంతకీ స్త్రీ వాదం అంటే ఏంటో కాస్త చెప్తారా...

ఆయనకింకా కోపం తగ్గలేదు... రెట్టించిన కోపం తో 

నీ తలకాయ....స్త్రీ ల హక్కుల గురించి వాదించడం... అంటూ అక్కడ నుంచి లేచి బయటకు అడుగులేసాడు..

ఇదంతా వింటున్న పరంధామయ్య గారి శ్రీమతి బయటకొచ్చి...

"స్త్రీ వాదం అంటే స్త్రీ ల హక్కుల కోసం వాదించడమే కాదు హక్కుల కోసం వాదించే స్త్రీ లను వారించడం.."

అంటూ నన్ను కూడా బయటకు దయచేయమన్నట్టు చేయి గుమ్మం కేసి చూపించింది.

హ్మ్... అని ఒక నిట్టూర్పు విడిచి... ఇంతకీ పరంధామయ్య కి కోపం ఎందుకొచ్చిందబ్బా ... అని బయటకి నడిచాను.

నాకర్థం కాకపోయినా... మీకర్థం ఐతే చెప్పండి....





No comments:

Post a Comment