Wednesday, August 24, 2011

ఆత్యాద్మిక సందేహం......

రాముడు, కృష్ణుడు... ఇంకా చాలా మంది ఐతిహాసికులను మనం దేవుళ్ళు గా పూజిస్తున్నాం కదా! అంతకు మునుపు అంటే రాముడి తండ్రి ఐన దశరథుడు ఎవరిని పూజించేవారు? అంతకు మునుపు కూడా భగవంతుడు వున్నాడు కదా? మనం  అందరం భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం, అందులో ఏ సందేహం లేదు. అంటే అంతటా వ్యాపించిన వాడు అని, అది ఆయన గుణం, అలాంటప్పుడు అవతరిచడం అంటే భగవంతుడు సర్వ వ్యాప్తిత్వాన్ని వదలి ఒక శరీరాన్ని ధరించడం; ఇలా జరిగినట్లయితే భగవంతుడు ఆయన గుణాన్ని వదిలివేయడమే అని స్పష్టం అవుతుంది. ఆ గుణం కోల్పోయిన దేన్నైనా కూడా భగవంతుడు అనడం తప్పు కదా! ఆయన భూమి మిద పుట్టిన ఉత్తమ పురుషుడిగా భావించడం, అనుసరించి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడం శ్రేయస్కరం కానీ భగవంతుడు అనుకోవడం లోనే నా సందేహం. మీ సమాధానాల వల్ల నా సందేహం నివృత్తి అవగలదు అని ఆశిస్తున్నాను. అని ఒక సందేహం పోస్ట్ చేస్తే దుర్గేశ్వర గారి దగ్గరనుంచి  కింది జవాబు వచ్చింది 

durgeswara said...
సర్వాంతర్యామిఅని మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఒకచోట లేడని చెప్పలేంకదా . కొత్తగాపుట్టటం కాదు అక్కడవ్యక్తమయ్యాడని అనుకోవచ్చుకదా. అంటే అక్కడున్నసంగతి మనకు ఇప్పుడే తెలిసిఉండవచ్చు కదా ? ఇక్కడ మీ భావం అర్ధమవుతున్నది . నేను ఇప్పుడు పదవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాసబ్జక్ట్ గూర్చి తెలిసిన మీరు మరలా అవసరమై ఒకటవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాకు అంకెలు ఎక్కాలే వచ్చు ఆల్జీబ్రారాదనుకోవచ్చా ? అలాగే పరమాత్మ ప్రాథమిక స్థాయిలో మానవులకు అందుబాటులోకొచ్చినందుకు మనం ఆయన సర్వవ్యాపకత్వాన్ని తక్కువగా నిర్ణయించుకోరాదు. మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి.అలాగే అనంతగుణసంపన్నుడైన ఆయన తత్వాన్ని మనం అవగాహన చేసుకోవటం కోసం అపారకరుణతో ఆయన మనదగ్గరకే వచ్చిన లీలా విశేషాలను అమాయకత్వంతో తిక్కతర్కాలతో అనుభవానికి తీసుకునే అదృష్టం కోల్పోరాదు మనం."     కాని ఈ సమాధానం నాకు తృప్తిని ఇవ్వలేదు అందుకే నేను నా సంధిగ్ధాన్ని ఇలా విన్నవించుకున్నాను.   "దుర్గేశ్వర గారు ముందుగా నమస్కారమండి మీ 'హరి సేవ', 'దైవ లీలలు' చూసాను చాలా బాగున్నాయి. ఇక మీరిచ్చిన సమాధానం లో "మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి." అని కదా, కానీ వాహనం టైర్ లో ఇదివరకు గాలి లేదు మరియు స్వతహా గ టైర్ లోకి వెళ్ళలేదు కాబట్టి పంప్ అనే పరికరం కావాలి, కానీ భగవంతుడి విషయం అలా కాదు ఆయన సర్వాంతర్యామి ఆయని జ్ఞానం అనంతం సంకల్ప మాత్రం చేత శ్రుష్టి చేసిన ఆయన ఒక చిన్న కార్యం చేయడానికి మానవ రూపం లో పుట్టవలసిన ఆవశ్యకత ఏమిటి? ఒక సారి ఆలోచించండి."    పెద్దలకు నా విన్నపం నా సందేహ నివృత్తి కి సహకరించి మీ అమూల్యమైన సమాధానాలతో చర్చ కొనసాగించాలని ఆశిస్తున్నాను.

2 comments:

  1. భగవంతుని నిరాకారునిగా కూడా భావించి పూజించవచ్చు. చిదంబరంలో అలా కూడా పూజించే విధానం ఉందని నాకు తెలిసినంతలో అనిపిస్తోంది.
    భక్తిలో పైస్థాయికి చేరుకున్న యోగులు కొందరు కూడా భగవంతుని నిరాకారంగా, సాకారంగా కూడా పూజిస్తారట.

    ఇక, దశరధుడు సూర్యుని పూజించేవారట. సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు కదా ! వారు ఎప్పటినుంచో ఉన్నారు.

    దేవతలు శరీరాన్ని ధరించి దుష్టులను అంతమొందించారు. దుష్టులను అంతమొందించాలంటే దైవానికి చిటికెలో పని. కానీ దేవతలతో అవతారాలను ధరింపజేసి , దుష్టులను అంతమొందించి , వారందరి జీవితాలను లోకహితం కోరి , పురాణేతిహాసాల ద్వారా , మానవాళికి అందించారు. అని కూడా అనుకోవచ్చు. పురాణేతిహాసములలోని కధలు ,ఉపకధల ద్వారా ప్రజలు ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.

    పిల్లలకు నీతి కధలు చెప్పే సమయంలో కొందరు పెద్దవాళ్ళు కూడా , తామే ఆ కధలలోని పాత్రధారులుగా నటిస్తూ పిల్లలకు నీతికధలు బోధిస్తారు. ఆ విధంగా చేయటం వల్ల పిల్లలకు అందులోని నీతి బాగా గుర్తుంటుంది...

    పెద్దవాళ్ళు పిల్లల మంచి కోసం కొంతసేపు అలా కధలలోని పాత్రధారులుగా నటించటం వల్ల వారి గొప్ప గుణాలకు వచ్చిన లోటేమీ లేదు కదా !.

    ReplyDelete
  2. మానవునికి జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని ధర్మాధర్మ సందేహాలకు పురాణేతిహాసాలలో సమాధానాలు లభిస్తాయి.

    జీవితంలో ఎలా నడచుకుంటే ఎలాంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది . వంటి ఎన్నో విలువైన విషయాలను వాటిద్వారా లోకానికి తెలియజేసారు అనిపిస్తుందండి..

    ReplyDelete