Sunday, August 31, 2014

వినాయక చవితి... ఎందుకిలా?

శుభోదయం ... 
మేము చిన్నప్పటి మాట... వినాయక చవితి వచ్చిందంటే ఆ హడావిడే వేరు. మా వీధి చివర వినాయకుడి విగ్రహం ఎంత పెద్దదో ఈ సారి అని ప్రతి యేడు అనుకునేవాళ్ళం. ఎంతో భక్తి గా చేసుకునే వాళ్ళు, చిన్నా పెద్దా అందరు ఉదయాన్నే స్నానం ముగించి కొత్త బట్టలు కట్టుకుని వినాయకుడిని చూడడానికి వెళ్ళే వారు. ముందు మా వీధి చివర వినాయకుడితో మొదలు పెట్టి ఊరంతా చుట్టేసే వారు. అన్ని విగ్రహాలు చూసాక కాని ఇంటి దారి పట్టేవారు కాదు. ప్రతి చోటా ఎంతో ఆహ్లాదంగా, మనసుకి హాయిగా ఒక రకమైన లోకం లో విహరిస్తున్నట్టు అనిపించేది. పండుగ అంటే ప్రతి చోటా ఇలాగె వుంటుంది అనుకునేవాళ్ళం. ఇక టీవీ లో అయితే అన్ని భక్తీ సినిమాలే.. వినాయక విజయం... తప్పకుండా వేసేవారు.  ఇక ఇంట్లో అయితే భక్షాలు , కుడుములు, చిత్రాన్నం, వడలు, కనీసం రెండు రకాల కూరలు, అన్నం, పప్పు, పూర్ణం తో చేసే రసం, పెరుగు, నెయ్యి వడియాలు. ఆహ నిజంగా పండగే ఆ రోజు.. మొట్ట మొదట స్తోమత కు తగ్గట్టు తెచ్చుకున్న చిన్న వినాయకుడి విగ్రహానికి నైవేద్యం పెట్టి అప్పుడు మేము తినే వాళ్ళం... అందరు కూర్చుని వినాయక విజయం చూస్తూ తినే వాళ్ళం. బడికి నిమజ్జనం రోజు కూడా సెలవే. కాని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేసేవారు. 3 రోజులో, 5 రోజులు, 11 రోజులు ఇలా... మా ఊరిలో పెద్ద విగ్రహం మాత్రమే 11 రోజులు. ఆ రోజే మాకు సెలవు. ఆ రోజు ఎవరు ఎక్కడున్నా ఊరికి వచ్చేవారు. ఊరేగింపు చేసుకుంటూ నిమజ్జనం కి వెళ్ళే వాళ్ళు. కోలాటం వేసుకుంటూ, రక రకాల వేషాలు వేసుకుని భక్తీ పాటలు పాడుకుంటూ ఎంతో శ్రద్ధగా చేసేవారు... కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వచ్చేసేవాళ్ళం. తలుచుకుంటే ఎంత బాగుందో.... కాలం మారింది ఈ మధ్య కాలం లో అప్పట్లా జరుపుకున్న పండుగ లా ఎప్పుడు జరుపుకోవడం లేదు.. అంతా కమర్షియల్, పోటీ పడి విగ్రహాల ఎత్తు పెంచుతున్నారు కానీ భక్తిని తగ్గించేశారు, లడ్డూ సైజు పెంచేశారు కానీ నీతి నియమాలు తగ్గించేశారు. కాంక్రీట్ జంగిల్ లో జంతువుల్లా జరుపుకుంటున్నారు (అందరూ కాదు ). నీతిని, విలువలని నిమజ్జనం చేస్తున్నారు. వినాయకుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు, చందాల పేరు చెప్పి చండాలం చేస్తున్నారు. భక్తి పేరు చెప్పుకుని మత్తు లో తూలి విగ్రహానికి బదులు తమని తామే నిమజ్జనం చేసుకుంటున్నారు... పడి చస్తున్నారు.. బజారు లో భక్తి పాటలు పాడుకుంటూ నిమజ్జనానికి  వెళ్ళాల్సిన జనం తాగి పబ్బు కి వెళ్తున్నట్టు వెళ్తున్నారు. మన పిల్లలకి ఆ రోజుల్లో ఇలా పండుగ జరుపుకునే వాళ్ళం అని చెప్పగలుగుతున్నాం కానీ చూపించలేకపోతున్నాం.... ఇంట్లో చూపించగలం కనీ బయటకు వెళ్తే మళ్ళీ తప్పటడుగులే.... ముందు ముందు ఇంకా ఏమి చూడల్సోస్తుందో.